తిరుమల

తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల....

తిరుమల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.


తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువు గా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తి ని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్ట లో కనుగొని, శ్రీవారి మూర్తి ని ప్రస్తుతం వున్న ప్రదేశం లో ప్రతిష్టించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితులు యొక్క వంశీయులే పరంపర గా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి (ఆకాశరాజు సోదరుడు)నిర్మించాడని ప్రతీతి. 


దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

స్థల పురాణం 


ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

చరిత్ర


ఇక్కడ లభ్యమైన శాసనాలనుబట్టి 15 వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై క్రీ.శ.614. ఈ మహారాణి కాలం లో ఆనంద నిలయం జీర్ణోద్దరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ, ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణి గా తిరుమల చ్రిత్ర లో శాశ్వతంగా నిలిచింది.ఈమెకి 'పేరుందేవి'అని మరో పేరువుంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429, హరిహరరాయలు క్రీ.శ. 1446 లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సాళువ నరసింహరాయలు క్రీ.శ.1470 లో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్థంభాల మండపాలని నిర్మిచాడు.క్రీ.శ.1473 లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు,ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10 న 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడో సారి తిరుమల సందర్శించి,మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న నాల్గవసారి తిరుమలని దర్శించి,30 వేల వరహాలతో కనకాభిషేకం చేసాడు. నిత్యారాధన కోసం తాళ్ళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
 1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్టించుకున్నాడు. 1518 సెప్టంబర్ 9న ఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17న ఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు. అచ్యుత రాయలు 1530 లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు. 16 శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్నాఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.
విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్ ప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు, 1740 లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, రక్షించి స్వామివారికి ఎన్నో అమ్మూల్య ఆభరణాలు సమర్పించాడు.
తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈష్టిండియా కంపెనీ వారి వశమైంది. 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున ఆ అలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. 1843 నుండి -
మహంతు సేవాదాస్ జీ,
మహంతు ధర్మ దాస్ జీ,
మహంతు భగవాన్ దాస్ జీ,
మహా వీరదాస్ జీ,
రామక్రిష్ణ దాస్ జీ,
ప్రయాగదాస్ జీ,
ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలనసాగింది.
వీరి తరువాత,1933 లోఅప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసాడు.

19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ... మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్థోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగిచెట్టు (ఇప్పుడు కల్యాణకట్ట ఉన్న ప్రదేశం) దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీమండపం బ్లాక్ అనేవారు. (ఇప్పుడా రోడ్డునే డి.ఎం.బి. రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.) అక్కణ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకొనేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదేబోర్డు రూ.26వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలుపెడుతున్నారు.

ఘాట్‌రోడ్డు నిర్మాణం



1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో 1974 లో రెండవ ఘాట్‌రోడ్డును(ప్రస్తుత ఎగువ రోడ్డు) కూడా నిర్మించారు.


స్వామి వారి పూజలు


రోజువారీ సేవలు


శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాష లో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది.


•సుప్రభాత సేవ : నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది.


•శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది.

•తోమాలసేవ: ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత రెండవ సారి మరల తోమాలసేవ చేస్తారు.


•కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు స్నపన మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. దీనినే శ్రీ వైఖానస భగవచ్చాస్త్రం లో 'యాత్రాసనం' అని కూడా అంటారు.

•సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి 1008 నామాలనూ స్తుతిస్తూ తులసి దళాలతో చేసే అర్చన.

•మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.

•అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణం లో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు.

రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట నైవేద్యం జరుగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.

రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది.

•ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మది దేవతలు వస్తారని ప్రతీతి. బ్రహ్మది దేవతలు స్వామి వారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచ పాత్రల లో ఉంచుతారు. వారు ఆరాధన చేసిన తీర్ధాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్ధంగా ఇస్తారు. ఏడుకొండలస్వామి పవళింపుసేవ లో అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.

•ముత్యాల హారతి: ఉత్తర మాడా వీధి లో నివసించే తరిగొండ వెంగమాంబ అనే మహాభక్తురాలు హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయం లో ఆమె ఇంటి ముందు నుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబ ని పాట పాడి హారతి ని ఇమ్మని భక్తులూ,అర్చకులూ అడిగేవారట కాలక్రమం లో అది ఒక సేవగా స్థిరపడిపోయింది.ఈ సేవనే'తరిగొండ ముత్యాల హారతి'అనేవారు.వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది.అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.

•గుడిమూసే ప్రక్రియ: రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

ప్రత్యేక సేవలు


రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు,నేత్ర దర్శనం,తిరుప్పావడ, సాయంత్రం పూలంగిసేవ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు.
 డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత వసంతోత్సవం ఇవన్నీ ఉత్సవమూర్తులకు ప్రతి నిత్యం జరిగేవి.



శ్రీవారి ఆభరణాలు



తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450)లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు (1509-1530) స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించాడు. 2 మే1513 న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించాడు. తంజావూరు రాజులు పాండ్యన్‌ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా... మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్‌ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది.

స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పని చేసిన థామస్‌ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం. అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌మీరా సమర్పించారు. వేంకటేశ్వర హెచరీస్‌ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ ‌ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది. తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది. 

స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, ఉదర బంధము, దశావతార హారము, బంగారు పులిగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి. ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి. 


కాలి నడకన చేరుకునే విధం


తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"! తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది, భక్తులు ఈ దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు। ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది, kadapa నుండి ఉందని ప్రతీతి.

•అలిపిరి కాలిబాట: ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం చాలా మంది భక్తులు కష్టసాధ్యమైన ఏడు కొండలూ దాటితే తమ కోరికలు తీరతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల (తితిదే) వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం. బస్సు ద్వారా గాని, రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తరువాత, అక్కడి నుండి తితిదే వారు నడుపుతున్న ఉచిత బస్సు / ఆటో / ప్రయివేటు బస్సు / టాక్సీ / జీపు ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని (ఏడు కొండలకు ఏడు అని అమ్ముతుంటారు), దారి మొదట్లో ఉన్న "వేంకటేశ్వరుని పాదాల గుడి" దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్లదారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటన వచ్చేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తొందరగా దైవదర్శనం అయ్యే విధానాన్ని అమలు చేసారు. 

•శ్రీవారి మెట్టు కాలిబాట: తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట. తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలాగే తితిదే వారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటలో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండేవి.కాని తిరుమల తిరుపతి దేవస్తానము వారు తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు.ఈ దారిలొ వేళ్ళేవారికి తిరుమల తిరుపతి దేవస్తానం వారు దివ్యదర్శనానికి టోకను మంజూరు చేస్తున్నారు,దారి పొడవునా నీటి కుళాయిలను వుంచారు,అలిపిరి లాగా మెట్టు దారి లాగా పైకప్పును కూడా యేర్పాటుచేసారు. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు అగస్త్యాశ్రమం లో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది.

రోడ్డు మార్గం


రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. మొదటిది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్‌స్టేషన్. రైళ్లు వచ్చే సమయానికి అక్కణ్నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టేషన్‌కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టేషన్ (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషన్ వెనకవైపు శ్రీ పద్మావతీ బస్‌స్టేషన్ ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.

రైలు మార్గం


తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషన్ నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లిపోవచ్చు.

విమాన మార్గం


తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.


చూడవలసిన ప్రదేశాలు



పాపవినాశనం


తిరుమల ముఖ్యాలయం: 

o వెండి వాకిలి లొ దర్శించవలసిన విశేషాలు: (వామ భాగం నుండి దక్షిణ భాగం వైపు) 
1. గర్భగుడి/ఆనందనిలయం
2. రామర్ మేడై(రాములవారి మేడ)
3. వరదరాజస్వామి ఆలయం
4. పోటు ప్రధాన వంటశాల(అన్నప్రసాదాలు తయారుచేయు స్థలం)
5. వకుళమాత దేవాలయం
6. బంగారు బావి
7. తీర్థం శఠరి ఇచ్చే ప్రదేశం హనుమ, అంగద, సుగ్రీవ, విష్వక్సేన, అనంత, గరుడ ఉత్సవ మూర్తులు ఉండే మంటపం. ఈ ఉత్సవ విగ్రహాలు ఇది వరకు రాములవారి మేడ లో వుండేవి. ఇప్పుడు 'యాగశాల' అనబడే 'తీర్థం, శఠారి మంటపం లో వుంచబడ్డాయి.
8. పరకామణి
9. విమాన వెంకటేశ్వరస్వామి
10. హుండీ
11. తాళ్ళపాక వారి అర: తాళ్ళపాక వారి అర(అన్నమయ్య భాంఢాగారం) లో రాగి మీద చెక్కిన అన్నమయ్య పాటలను దాచి ఉంచారు.
12. భాష్యకార్ల సన్నిధి
13. బొక్కసం సెల్
14. యోగ నరసింహస్వామి ఆలయం
15. పరిమళపు అర

o వెండివాకిలి బయట ఉండే విశేషాలు 
1. క్షేత్ర పాలక గుండు
2. తిరుమల రాయల మండపము
3. రంగనాయకుల మండపము
4. కళ్యాణ మండపము
5. విరజా నది
6. పడిపోటు/ దిట్టం(శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్లు,వడలు,జిలేబి,మున్నగు పణ్యారాలను తయారుచేయు స్థలం)
7. రామానుజ కూటమి
8. అయన మహల్(అద్దాల మండపము)
9. పూల బావి
10. తులాభారం
11. పద్మ నిధి, శంఖ నిధి

ఇతర ఆలయాలు, ప్రదేశాలు 

1. వరాహ స్వామి దేవాలయం
2. గొల్ల మండపం

వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్లమండపం. గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది.
1. అఖిలాండం
2. బేడి ఆంజనేయస్వామి దేవాలయము
3. కల్యాణకట్ట: భక్తులు మొక్కుగా తలనీలాలు సమర్పిన్ఛు స్థలము.
4. తిరుమల ఆస్థాన మండపం
5. శ్రీవారి ఆన్నదాన నిలయం
6. శ్రీవారి పాదాలు
7. శిలాతోరణం

తిరుమల కొండలమీద ఉన్న వివిధ తీర్థాలు: 

1. తుంబురు తీర్థము
2. రామకృష్ణ తీర్థము
3. పాండవ తీర్థం
4. దేవతీర్థం
5. కుమారధారాతీర్థం
6. కాయరసాయన తీర్థము
7. జాబాలి తీర్థము
8. శేష తీర్థము
9. పసుపుధారా కుమారధారా తీర్థము
10. చక్రతీర్థం
11. శంకుతీర్ధం
12. పంచాయుధతీర్థం
13. బ్రహ్మతీర్థం
14. అగ్నికుండతీర్థం
15. సప్తర్షితీర్థం
16. విష్వక్సేన సరస్సు
17. పాప వినాశనము
18. ఆకాశ గంగ
19. గోగర్భం డ్యాము/గోగర్భతీర్ధం
20. స్వామి పుష్కరణి
21. వైకుంఠ తీర్ధం
22. కపిలతీర్థం

ఇంకా దర్శించవలసిన ప్రదేశాలు 

1. మ్యూజియం
2. శిలాతోరణం
3. ధ్యాన మందిరం



COMMENTS

పేరు

temples,28,
ltr
item
ApurupA Bhakti: తిరుమల
తిరుమల
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhs0h6AT2GAR87axmDQIRC5KyTZrKA3cwpqB4k31aFnA46gcnYJ3n7jh3METQCNS3_Fv3Fhs1dM_gcBlxMeT6vJo2-Thj75WmsI53X9dTqkq4Ji2n96tZeuK0NpaHmUFrJnjMF5BqwLuPm8/s1600/old++photo+of+balaji.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhs0h6AT2GAR87axmDQIRC5KyTZrKA3cwpqB4k31aFnA46gcnYJ3n7jh3METQCNS3_Fv3Fhs1dM_gcBlxMeT6vJo2-Thj75WmsI53X9dTqkq4Ji2n96tZeuK0NpaHmUFrJnjMF5BqwLuPm8/s72-c/old++photo+of+balaji.jpg
ApurupA Bhakti
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_31.html
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_31.html
true
7109105649913831149
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy