కాశీ

కాశీ లేదా వారాణసి (Kasi, Benaras, Varanasi) భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదే...

కాశీ లేదా వారాణసి (Kasi, Benaras, Varanasi) భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం కలదు. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు. 


గంగానది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్‌చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది.

విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారాణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి. 

వారాణసి పేరు


గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. 
 కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు. "వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది. వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

చరిత్ర


సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాధల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంధాలలో కాశీనగరం ప్రసక్తి ఉన్నది.

వారాణసి నగరం సుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చువాంగ్ (Xuanzang) ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.
18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ రామ్ నగర్ కోటలోనే నివశిస్తున్నాడు.

పురాణకథనాలు


కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు. అయోధ్య, మథుర, గయ, కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదం షుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్ధంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.

మౌర్యుల కాలంలో తక్షశిల మరియు పాటలీపుత్ర మద్య ఉన్న రహదారితో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని షుమారు 1000 ఆలయాలను ధ్వశం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వశం చేయబడ్డాయి. ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిదువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వశం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరికవైపు వారణాశి మేధావులకు మరియు తాత్వికులకు కేంద్రంగా మారింది. మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు మరియు విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన కబీరుదాసు జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్ధంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి. అలాగే 15 వ శతాబ్ధంలో సంఘసంస్కర్త , యోగి, కవి, యాత్రికుడు మరియు మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం మరియు దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, భోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.

స్వాతంత్రానికి ముందు చరిత్ర


16వ శతాబ్ధంలో మొగల్ చక్రవర్తి ఆక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల(660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్ధం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న " బిందు మహాదేవాలయం " సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి కొలకత్తా నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంశం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ ఔరంగజేబు మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి. ప్రస్థుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు మరియు మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి. ప్రస్థుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్ధానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (క్రీ.శ 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం ( కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్ధంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్ధంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.

ప్రత్యేక సంఘటనలు


1897లో మార్క్ ట్వైన్, వారణాశి గురించి వర్ణిస్తూ " బెనారస్ చరిత్రకంటే పురాతనమైనది. సంప్రదాయాలకంటే పాతది, పురాణాలకంటే పురాతనమైనది అలాగే అన్నింటికంటే అత్యంత పురాతనమైనది. 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వారణాశిని భారతీయ భూభాగంగా చేసి రామనగరాన్ని రాజధానిగా చేసి తన న్యాయపరిధి నుండి తొలగించింది. అయినప్పటికీ తరువాత కూడా గంగాతీరంలో వారణాశి భుభాగంలో ఉన్న రామనగర్ కోటలో కాశిరాజు నివసిస్తూ ఉన్నాడు. ప్రస్థుతం రామనగర్ కోటలో కాశిరాజులకు చెందిన వస్తుసంగ్రహాలతో మ్యూజియం నిర్వహించబడుతుంది. 18వ శతాబ్ధం నుండి ఈ కోటలో కాశీరాజులు నివసిస్తూ వచ్చారని ప్రాంతీయ వాసులు వివరిస్తున్నారు. రాజు మతపరంగా అధ్యక్ష స్థానంలో ఉంటాడు అలాగే ప్రజలు రాజుని శివుని అవతారంగా భావిస్తారు. రాజు స్వయంగా అన్ని మతసంప్రదాయాల సంప్రదాయాలకు ఆధిపత్యం వహిస్తుంటాడు.

1857 లో వారణాశిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వాతంత్ర సమరయోధుల మీద జరిగిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాశిలో అనీబిసెంట్ దియోసాఫీ సిద్ధ్హంతం ప్రతిపాదించడమేగాక " సెంట్రల్ హిందూ కాలేజ్ " స్థాపన కూడా చేసింది. తరువాత సెంట్రల్ హిందూ కాలేజ్ 1916 నుండి " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " గా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనీబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజ్ ని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషిచేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది. అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించడం అనీబిసెంట్ లక్ష్యాలలో భాగమే. వారణాశి 1948 అక్టోబర్ 15 న యూనియన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడింది. 2000 లో విభూతి నారాయణన్ సింగ్ మరణం తరువాత ఆయన కుమారుడైన అనంత్ నారాయణ్ సింగ్ రాజయ్యాడు. రాజు కాశీరాజు సంప్రదాయాల ఆచరణ బాధ్యతను వసహిస్తాడు.

భౌగోళికం

సంస్కృతి


వారాణసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలెనే ఉంటుంది. అయితే వారాణసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత, , హిందూ-ముస్లిమ్ సహ జీవనం, హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివశిస్తున్నారు.

గంగానది


గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

స్నాన ఘట్టాలు


వారణాశిళొని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో షుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు (సింధియాలు), హోల్కార్లు, భోంస్లేలు మరియు పెషావర్లు నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్" మరియు "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్‌లు స్నానానికి మరియు దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్‌లు పురాణ గాధలతో ముడివడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంశించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం మరియు ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.

•తులసీ ఘాట్ వద్ద తులసీదాసు తులసీ రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తున్నారు.

దశాశ్వమేధ ఘాట్


కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇది యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకందారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫొటోలు తీసికొనేవారికి చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాధ. ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంథేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయవినాయక ఆలయాలతో గంగా, బండిదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రీకులు ఇక్కడి ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి. వారు ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకువచ్చి నదిలో నిలిపి వేస్తారు. యాత్రీకులు అక్కడి నుండి హారతి చూడవచ్చు. సాధారణంగా హారతి ముగిసిన తరువాత నది నిర్మానుష్యం ఔతుంది. బోటులో ఉండగానే చిన్న చిన్న వ్యాపారులు తమవస్తువులను విక్రయించడం యాత్రీకులను ఆకర్షించే విషయాలలో ఒకటి.

మణి కర్ణికా ఘాట్

మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాధ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే హరిశ్చంద్రుడిని కొని, హరిశ్చంద్ర ఘాట్‌లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్‌లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. మణికర్ణికాఘాటుకు మహాశ్మశానమని మరొక పేరుకూడా ఉంది. ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రస్థుత ఘాట్ 1032 లో నిర్మించబడింది. 4వ శతాబ్ధంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్థావన ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరాలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తుంటాడని విశ్వసించబడుతుంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశమిదే అని ప్రజల విశ్వాసం.

సిండియా ఘాట్

150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాట్ బరువుకు ఇక్కడి శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కథనం. మగ సంతానం కావాలని కోరేవారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సిండియా ఘాట్‌కు ఉత్తరాన మణికర్ణికా ఘాట్ ఉంది. వెనుక ప్రక్క సిద్ధక్షేత్రంలో అనేక ముఖ్యమైన అలయాలున్నాయి.

మన మందిర్ ఘాట్

1770లో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ ఈ మన మందిర్ ఘాట్‌ను, దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం రాజస్థాన్-ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు. అంబర్ రాజు మాన్‌సింగ్ మానస-సరోవర్ ఘాట్‌ను, దర్భంగా మహారాజు దర్భంగా ఘాట్‌ను నిర్మింపజేశారు.

లలితా ఘాట్

ఇది నేపాల్ రాజుచే నిర్మింపజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణ్వాలయంలో పాశుపతేశ్వరస్వామి విగ్రహం ఉంది.

అస్సీ ఘాట్

ఇది చాలా సుందరమైనది. అన్ని ఘాట్‌లకు చివర ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది.

ఇంకా

జైన భక్తులు బచరాజ్ ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ నది వడ్డున మూడు జైనాలయాలున్నాయి. తులసీ ఘాట్ వద్ద గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు.

మాతా అనందమయి ఘాట్
అస్సీ ఘాట్
అహల్యాభాయ్ ఘాట్
ఆది కేశవ ఘాట్
అహల్యా ఘాట్
బద్రి నారాయణ ఘాట్
బాజీరావ్ ఘాట్
భౌలీ/ఉమారావుగౌరి ఘాట్
భాదైనీఘాట్
భన్సలే ఘాట్
బ్రహ్మ ఘాట్
బూందీ పరకొట ఘాట్
ఛౌకీ ఘాట్
ఛౌసతీ ఘాట్
చేఠ సింగ్ ఘాట్
దండీ ఘాట్
ధరభాంగ ఘాట్
ధస్వమేధ్ ఘాట్
డీగ్పటీయ ఘాట్
దుర్గా ఘాట్
గంగా మహల్ ఘాట్ 1
గంగా మహల్ ఘాట్ 2
ఘయ్ ఘాట్
గణేష ఘాట్
గోలా ఘాట్
గులరీయ ఘాట్
హనుమాన్ ఘాట్
హనుమనగర్ధి ఘాట్
హరీష్ చంద్ర ఘాట్
జైన్ ఘాట్
జాలశయ్ ఘాట్
జానకి ఘాట్
జాతర ఘాట్
కర్ణాటక రాష్ట్ర ఘాట్
కేదర్ ఘాట్
ఖీర్కయ ఘాట్
ఖౌరి ఘాట్
లాలా ఘాట్
లాలీ ఘాట్
లలితా ఘాట్
మహనీర్వణీ ఘాట్
మన మందిరా ఘాట్
మరససరోవర ఘాట్
మంగళ గౌరీ ఘాట్
మణీకర్ణిక ఘాట్
మెహతా ఘాట్
మీర్ ఘాట్
మున్షి ఘాట్
నందీశ్వర ఘాట్
నారద ఘాట్
నయా ఘాట్
నేపాలీ ఘాట్
నిరంజాని ఘాట్
నిషాద్ ఘాట్
పాత  హనుమనన ఘాట్
పంచగంగ ఘాట్
పంచ్కోట ఘాట్
పాండే ఘాట్
ఫుట ఘాట్
ప్రభు ఘాట్
ప్రహలద ఘాట్
  ప్రయకాఘాట్
రాజ్ ఘాట్
రాజా ఘాట్
రాజా గౌలియార్ ఘాట్
రాజేంద్ర ప్రసాద్ ఘాట్
రామ్ ఘాట్
రానా మహీళ ఘాట్
రేవన్ ఘాట్
సక్క ఘాట్
సంకఠఘాట్
సర్వేశ్వర ఘాట్
సింధియా ఘాట్
శీవల ఘాట్
శైతల ఘాట్
శీతల ఘాట్
సోమేశ్వర ఘాట్
త్రీలింగల ఘాట్
త్రీలోచన ఘాట్
త్రిపుర భైరవి ఘాట్
తులసి ఘాట్
వచ్చరాజా ఘాట్
వేణీమాధవ ఘాట్
విజయనగర ఘాట్

పవిత్ర క్షేత్రం



వారాణసి హిందువులందరికి పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షమంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం, దైవ దర్శనం చేసుకొంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు.  గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.


బౌద్ధులకు కూడా వారాణసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రాస్థలాలలని బుద్ధుడు బోధించాడు. వారాణసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధననుపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకునికంటె ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థఅనంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట.

జైనుల 23వ తీర్ధంకరుడైన పార్శ్వనాధుని జన్మ స్థలం అయినందున వారాణసి జైనులకు కూడా పవిత్ర స్థలమే.

వారాణసిలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకొని ఉంది. హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలు, లేదా ఘర్షణ వాతావరణం అప్పుడప్పుడూ సంభవింఛాయి.

ఆలయాలు

వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) కాని ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం మరియు దుర్గా మందిరం ( ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).

విశ్వనాధ మందిరం

కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు" , "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ iఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.  .

అన్నపూర్ణామందిరం

కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.

శాంక్తా మందిరం

సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తామందిరంలో పెద్ద సింహంశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.

దుర్గా మందిరం

వారణాశిలో రెండు దుర్గామందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గామందిరం ఒకటి. రెండవది "కోతుల గుడి" గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత " నాగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.

సంకట మోచన్ హనుమాన్ మందిరం

కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా మరియు కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసినదీతీరంలో ఉంది. ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మరియు " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " వ్యవస్థాపకుడూ అయిన మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. మద్యయుగానికి చెందిన సన్యాసి మరియు రామాయణ( తులసి రామాయణం) సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ మరియు శనివారాలలో హనుమతునికి విశేష పూజలు నిర్వహించబడతాయి కనుక ఈ రెండు రోజులలో ఆలయానికి వేలాది భక్తులు వస్తుంటారు. కష్టాలనుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువైయున్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతి ఇస్తున్న సమయంలో బాంబులు పేల్చారు. అప్పుడు ఆలయంలోంవివాహబృదం పూజలు నిర్వహిస్తున్న కారణంగా అధికసంఖ్యలో భక్తులు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ మరునాడు ఆలయంలో పూజాదికాలు నిర్వహిచి హనుమాన్ చాలిసా, సుందరా కాండ పారాయణం నిర్వహించి తులసీదాసు విరచిత హనుమాన్ చాలిసా, సుందరా కాండ పుస్తకాలు ఉచితంగా అందించబడ్డాయి. తీవ్రవాదుల దాడి తరువాత ఆలయంలో పోలీస్ రక్షణ ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్యాఇవాలైన సీతారాముల ఆలయం ఉంది.

తులసీ మానస మందిరం

ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది.పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం కుడ్యాలు మీద తులసీ రామాయణం లిఖింబడి ఉంది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాలరూపంలో ప్రదర్శించబడుతున్నాయి. అలాగే రామాయణ కావ్యసంబంధిత తామ్రఫలకాలు కొన్ని కూడా ఇక్కడ బధ్రపరచబడి ఉన్నాయి.

భారతమాత ఆలయం

భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ అంకితం భారత మాతా ఆలయం, 1936 లో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. . ఇది పాలరాతితో చెక్కిన భారతదేశం చిత్రపటణ్ ఉంది. బాబు శివ ప్రసాద్ గుప్తా మరియు దుర్గా ప్రసాద్ ఖత్రీ, ప్రముఖ , పురాతన వస్తువులను అధ్యయన శాఖ మరియు జాతీయ నేతలు, దాని నిర్మాణం కోసం విరాళంగా నిధులను అందించారు.

బిర్లా మందిరం

కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది. ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆవరణలో బిర్లాకుంటునబం చేత నిర్మ్ంచబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది పండిట్ మదన్ మోహన్ మాలవ్యా అన్నది మరొక ప్రత్యేకత.

కాలభైరవ మందిరం

కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వర్ గంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఈ అలయం నుండి దారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ (శివుడు) మందిరం ఉంది. ఆలయసమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాలనుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు.

కవళీ మాత

కవళిమాత ఒకప్పుడు కాశిలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదావిశ్వేరుని భక్తిశ్రద్ధాసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగాస్నానం తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె స్నాంచేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను స్పృజించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చెయ్యడం తిరిగి హరిజనుడు స్పృజించడం తిరిగి గంగాస్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయింది. ఆమె ఆరోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణా మాత క్షేత్రం కనుక ఆక్షేత్ర సరిహద్దులలో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తనక్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది. కవళీ మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చెయ్యనని చెప్పింది. అన్నపూర్ణా మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళీ కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చెయ్యలేక పోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపసు చేసింది. ఆమెకు శివిడు ప్రత్యక్షం కాగానే ఆమె " ఈశ్వరా ! నాభక్తిలో లోపమేమిటి. నన్నిలా కాశీనుండి పంపిన తరువాత నేనిక నీదర్శనం ఎలాచేయగలను. " అని ఆవేదనపడింది. ఈశ్వరుడు " కవళీ ! నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు స్పృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు, పురజనులే కాదు. సకల ప్రాణులూ ఒకటే. ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీభక్తికి, తపసుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు " అని చెప్పి అదృశ్యం అయ్యాడు. అప్పటి నుండీ కవళీ " కవళీ మాత " అయింది. కనుక భక్తులు కాశీ విశ్వేరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో " ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ ఫలితం నాకు ఇవ్వు " అని ప్రార్ధించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు.

ముఖ్య శివ లింగాలు


వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు
విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

మతపరమైన ఉత్సవాలు

మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది.
తులసీ ఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి- మార్చ్ మాసాల మద్య నిర్వహించబడతాయి.
సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి (మార్చ్-ఏప్రెల్) హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి మరియు ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట ఐదు రోజులపాటు సాస్కృతిక సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు.
రామనగర్ రామలీలా వద్ద రామచరితమానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామనగర్‌లో 31 రోజులు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశినరేష్ చేత నిధిసహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణసంహారంతో ముగింపు పలుకుతారు. కాశీనరేష్ చేత 1830లో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
భారత్ మిలాప్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తరువాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తనపరివారంతో రాజరీక అలంకారలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
కార్తికమాస కృష్ణచవితి నాడు కాళీయుని మీద కృష్ణిని విజయానికి సంకేతంగా కాళీయమర్ధన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగాతీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలలు కాళీయుని శిరసులపై నృత్యం చేసి వేణుగానం వినిపిస్తుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగాతీరం మరియు పడవలలో ఉండి చూస్తుంటారు.
గంగాఅహోత్సవాల పేరిట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తిక పూర్ణమినాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతఙత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.
గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.
ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో మరియు పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

పర్యాటక రంగం

వారణాసి లో విలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులకు చాలా ప్రీతిపాత్రమైన యాత్రా స్థలం. నగరంలో 3,4, 5 స్టార్ హోటళ్ళు కూడా ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు లభ్యమౌతాయి.అక్కడి సంస్కృతి ప్రభావం వలన వీటిలో చాలా వరకు వీధుల్లోనే లభిస్తాయి. పట్టు వస్త్రాలకు, ఇత్తడి సామానుకు వారాణసి ప్రసిద్ధి చెందినది. ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్క సామాను, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు, ఆకర్షణీయమైన దీపపు స్థంభాలు మరియు హిందూ, బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభిస్తాయి. చౌక్, గొధౌలియా, విశ్వనాధ్ సందు, లహురాబీర్, థటేరి బజార్ ముఖ్యమైన బజారులు పురాతనమైన వారణాశి నగరంలో నాలుగవ భాగం గంగాతీరంలోనే ఉంది. ఇరుకైన సందులతో కూడిన వీధులతో ఉంటుంది. ఇవి కొత్తవారిని చాలా అయోమయంలో పడవేస్తాయి కనుక ఇక్కడ తిరగాలంటే సహాయకుల అవసరం ఎంతైనా ఉంది. హిందూ ఆలయాలు వీధివెంబడి అంగళ్ళూ ఇక్కడ ప్రసిద్ధం. ఈ నగర పురాతన తత్వం విదేశీ పర్యాటకులను సైతం అమితంగా ఆకర్షిస్తుంది. వారణాశిలో మద్యతరగతి మరియు ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు నివసించడానికి అనువైన ప్రదేశాలు ఆలయానికి దూరంగా ఉంటాయి. అక్కడ తక్కువ కాలుష్యం అరియు తక్కువ జనసాంద్రత ఉండడం విశేషం. అంతేకాక పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో సారనాథ్ మ్యూజియం, జంతర్ మంతర్, భారత్ కళాభవన్ మరియు రామనగర్ కోట ముఖ్యమైనవి.

జంతర్ అంతర్

గంగాతీరంలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో జంతర్ అంతర్ ఒకటి. ద్శాశ్వమేధ్ ఘాట్ సమీపంలో గంగాతీరంలో ఎత్తైనప్రదేశంలో జయపూర్ రాజు అయిన రాజా జై సింగ్ ఘాటును ఆనుకుని జంతర్ మంతర్ ఉంది. డిల్లీ మరియు జైపూర్ అబ్జ్ర్వేటరీలలా వారణాశి అబ్జర్వేటరీలో ఉపకరణాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్న " సన్డయల్ ఏక్వేషనల్ " ఒకే ఒకేఒక న్యక్తి నిర్వహిస్తూ వివరాలనలు నమోదు చేయబడుతున్నాయి.

రామనగర్ కోట

రామనగర్ కోట గంగానది తూర్పుతీరంలో తులసీఘాటుకు ఎదురుగా ఉంది. రామనగర్ కోటను 18వ శతాబ్ధంలో కాశీనరేష్ రాజా బలవంత్ సింగ్ చేత నిర్మించబడిది. ఈ కోట చునార్ ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఇది మొగల్ నిర్మాణశైలితో వంపైన బాల్కనీలు, బహిరంగ సభామండపాలు మరియు సుందర ద్వారాలు కలిగిఉంది. ప్రస్థుతం ఈ కోట జీర్ణావస్థలో ఉంది. ఈ కోట మరియు ఇందులో ఉన్న పురాతన వస్తుసంగ్రహాలయంలో బెనారస్ రాజవంశానికి చెందిన వస్తువులు బధ్రపరచబడి ఉన్నాయి. 18వ శతాబ్ధం నుండి ఈ కోట కాశీనరేశ్ నివాసస్థానంగా ఉంది. ప్రస్థుతం ఈ కోటలో ప్రస్థుత కాశీనరేస్ అనంత నారాయణ్ సింగ్ నివసిస్తున్నాడు. 1971లో నుండి కాశీ రాజరికం తొలగించినప్పటికీ నామమాత్ర రాజరికం మరియు పురాతన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. " యాన్ ఎసెంట్రిక్ మ్యూజియం" (అసాధారణ మ్యూజియం) అన్న పేరుతో ఉన్న ఉపభాగంలో నవరత్నఖచిత పల్లకీలు, అద్భుతమైన ఆయుధశాల మరియు అరుదైన జ్యోతిష గడియారం భద్రపరచబడి ఉన్నాయి. సరస్వతీ భవనంలో మతసంబంధిత వ్రాతపతులు భద్రపరచబడి ఉన్నాయి. గోస్వామీ తులసీదాస్ వ్రాసిన రామాయణప్రతులు కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. సుందరమైన డిజైనులు కలిగిన కవర్లను తొడిగిన మొగల్ మినియేచర్ శైలిలో పలు వర్ణచిత్ర పుస్తకాలుఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఈ పుస్థకాలలో గంగాతీర సౌందర్యం ప్రతిబింబించే చిత్రాలు ఉన్న కారణంగా ఇవి చలనచిత్రాల ఔట్‌డోర్ చిత్రాలలో ఉపయోగించబడుతున్నాయి. ఇక్కడ నిర్మించిన చలనచిత్రాలలోంబెనారస్ పేరున్న చలనచిత్రం చిత్రం ప్రధానమైన చలనచిత్రం చిత్రాలలో ఒకటి. ఈ కోటలో కొంతభాగం పర్యాటకుల కొరకు తెరచి ఉన్నప్పటికీ మిగిలిన భాగం కాశీ నరేష్ మరియు కుటుంబానికి నివాసంగా ఉపయోగపడుతూ ఉంది. ఈ కోట వారణాశి నుండి 14 కిలోమీటర్ల( 9 మీటర్లు) దూరంలో ఉంది.

ఇతరాలు

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు. స్కాంద పురణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యాన్ని గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు



ముల్లోకాలు నాకు నివాసమే. అందులో కాశీ క్షేత్రం నా మందిరం.

COMMENTS

పేరు

temples,28,
ltr
item
ApurupA Bhakti: కాశీ
కాశీ
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhqgOwKAo1vlih4H86mgtQyW0O_dp-k-OJJfB6Yhc_sXwK2Iq8SV7qWPtGlv9bT5yWb1hSMn3f97Sb66vahmSIO2g7_0fNhO7zLPsdAuJaVEDU-r1wQFxsBph9kMIEuUNDieYF0-K7r0RZ1/s1600/old-town.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhqgOwKAo1vlih4H86mgtQyW0O_dp-k-OJJfB6Yhc_sXwK2Iq8SV7qWPtGlv9bT5yWb1hSMn3f97Sb66vahmSIO2g7_0fNhO7zLPsdAuJaVEDU-r1wQFxsBph9kMIEuUNDieYF0-K7r0RZ1/s72-c/old-town.jpg
ApurupA Bhakti
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_48.html
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_48.html
true
7109105649913831149
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy