బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసర, (Basara) పుణ్యక్షేత్రం ఆదిలాబాదు జిల్లాలోని ముధోల్ మండలంలో వుంది. ఇది Nizamabad పట్టణానికి 35 కి.మీ...
బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము.
బాసర, (Basara) పుణ్యక్షేత్రం ఆదిలాబాదు జిల్లాలోని ముధోల్ మండలంలో వుంది. ఇది Nizamabad పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం.
బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు. భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. హిందూ మతం ప్రకారం జ్ఞానంను ప్రసాదించు దేవత సరస్వతి. పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం నందు అక్షరాభ్యాస కార్యక్రమ వేడుకను జరుపుకుంటారు.
పురాణగాధ
బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టించినట్లు చెప్పుచుందురు. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ చెప్పతగింత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతసించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి మార్బుల్ శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన అష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది.ఆరవ శతాబ్ధంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కధనం ప్రచారంలో ఉన్నది.
ఆలయ విశేషాలు
బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక ఋసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాప్రసూనాంబ చేతిలో ఉన్న అఖంద జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. నూనె ఇక్కడ ఖరీదుకు లభిస్తుంది. అమ్మవారికి సమర్పించిన చీరలు ఆసక్తి కల భక్తులు కొనుగోలు చేసి పొంద వచ్చు. వెలుపలి కౌంటర్ వద్ద భక్తులు ప్రసాదములు కొనుక్కునే వసతి కూడా ఉంది.
దేవాలయం
సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.
ఎలా వెళ్ళాలి
హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా) బస్సు సౌకర్యం ఉన్నది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉంది.
చూడదగిన స్థలాలు
ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.
మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సుచేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒకోప్రక్క ఒకో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్ధం, సూర్యతీర్ధం, వ్యాసతీర్ధం, వాల్మీకి తీర్ధం, విష్ణుతీర్ధం, గణేషతీర్ధం, పుత్రతీర్ధం, శివతీర్ధం. గోదావరి సమీపంలో ఒక శివాలయం కుడా ఉంది.
పూజా విశేషాలు
ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యైఆర్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానికలు సమర్పించే ఆచారము ఉన్నది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.
దర్శన వేళలు :- ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.3 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.3 గంటల వరకు అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.3 గంటల నుండి 12.3 గంటల వరకు అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.3 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.3 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.3 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.3 గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.
ముఖ్యమైన ఉత్సవాలు
మహా శివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపబడే ఉత్సవాలు. ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతాయి.
నవరాత్రులు
ఆశ్విని శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతము, దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహర్నవమి రోజున చండీ హోమము చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికధలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.
శ్రీ పంచమి మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. మహాభిషేకం తరువాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు. జగద్రక్షణకై, భక్త పోషణకై అవతరరించిన కామితార్ధ ప్రదాయినిగా బాసర జ్ఞాన సరస్వతి ఈనాడు విశేష పూజలందుకొంటుంది. వసంత పంచమికి 15 రోజుల ముందు నుండి ప్రారంభం అయ్యే ఈ ఉత్సవాలు వసంత పంచమికి మూడు రోజుల వరకు జరుగుతాయి. ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు ఆరాధనలు జరుపుతారు.
మహా శివరాత్రి
మహా శివరాత్రి పర్వదినం మొదలుకొని మూడు రోజులు పెద్ద జాతర సాగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణాలు ఆచరిస్తారు.
మాధుకరము
ఈ వూరిలో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి (యాచించుట) ద్వారా లభించే భిక్షకు మాధుకరము అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రము అనుష్టానం చేస్తారు. ఆ కాలంలో వారు మధ్యాహ్నం వూరిలోనికి పోయి భిక్షను స్వీకరించి, సరస్వతీ దేవికి నమస్కరించి, ఆ భిక్షను భుజిస్తారు.
వసతులు
ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిధి గృహం, వేములవాడ దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిధిగృహం మాత్రమే ముఖ్య వసతులు. ప్రస్తుతం అనేక లాడ్జీలు నడుపబడుతున్నాయి. ఎపి టూరిజమ్ బస్ టిక్కెట్స్ వద్ద టిక్కెట్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఛాయాచిత్రాలను చూడ వచ్చు. వసతి గృహములు :- లగ్జరీ అకామిడేషన్, ఫ్యామిలీ గెస్ట్ హౌస్, బెస్ట్ ఎకనమీ అకామిడేషన్ లాంటి వసతి గృహాలు భక్తులకు ఇక్కడ ఉండడానికి తగిన వసతులు కల్పిస్తున్నాయి.
హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా) నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు సౌకర్యం లభిస్తూ ఉన్నది. నిజామాబాద్ నుండి బాసరకు 35 కి.మీ. దూరం.
కొన్ని ప్రార్ధనలు
విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతరమ్
నమోస్తు వేదవ్యాస నిర్మిత ప్రతిష్టితాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయై
నమోస్తు అష్ట తీర్థజల మహిమాన్వితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమోనమః
COMMENTS